బలిపశువు


బలిపశువు


నీ పేరేంటి?” గర్బిణీ పేషెంట్ ని చెక్ చేస్తూ అడిగింది డాక్టర్ యశోధర
లచ్చిమండి సిగ్గుపడుతూ చెప్పింది లక్ష్మి.
మీ ఆయనేం చేస్తుంటాడు?”
ఆయన అనగానే ఆవేశపడుతూ ఏం సేత్తాడు? నాకీ గతి తెప్పిస్తుంటాడుఉక్రోషంగా అంది లక్ష్మి.
  అదికాదు లక్ష్మీ! ఏం పని చేస్తుంటాడు?” అని
కూలిపనమ్మగోరూ!
నిన్ను బాగా చూసుకోడా?”
ఆ! అంతోటి ఆడు తెచ్చింది ఆడికే సాలదమ్మగోరూ! ఇంక నన్నూ పిల్లల్ని ఏం సూత్తాడు? పొద్దోయేక తప్పతాగి సీకట్లో తూలుకుంటూ ఒత్తాడు.ఆడొచ్చేసరికి మాంసం కూరో,సేపల పులుసో నేదా కనీసం గుడ్డు ఓసనైనా తగలాలి నేకపోతే నన్ను గొడ్డును బాదినట్లు సితకబాదతాడుఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ దు:ఖాన్ని దిగ మ్రింగుకొంటూ చెప్పుకుపోతుంది లక్ష్మి. ఆ వేదనాభరితమైన ఆవేదనా ప్రవాహానికి అడ్డువేయలేక సానుభూతితో వింటుంది ఓ డాక్టరుగా కాకపోయినా సాటి స్త్రీగా.
లక్ష్మి చెప్పుకుంటూ పోతుంది. ఆ తర్వాత ఉన్నదేదో తినేసి నిద్దరోతాడు. ఆ నిద్దట్లోనే నా అవుసరం ఒత్తాది. ఆ నిసాలోనే ఆడి దగ్గర మిగిలిన డబ్బులేవైనా ఉంటే నాకు దక్కుతాయి. నా బతుకేదో నా నెట్టాగొ సర్దుకుపోతూ,ఈడుసుకొత్తున్నాను కానీ రేపొద్దున్న నా పిల్లలేవవుతారోననే బెంగ అమ్మగోరూఅంటూ వాపోయింది.
సరి సరి ఇంతకూ అసలు సంగతి అడుగుదామనుకుంటూనే మర్చిపోయాను. నీకెంత మంది పిల్లలు?”
ఆరుగురు అమ్మగోరూ “.
మరి ఇంతవరకూ పిల్లలు పుట్టకుండా ఆపరేషనెందుకు చేయించుకోలేదు ?”అని అడిగింది యశోధర.
అదే నమ్మగోరూ ! నువ్వయినా ఆపరేసను చేయించుకో నేదా నానయినా సేయించుకుంతానంతే ఇనిపించుకోడే. నాను సేయించుకోవడం ఆడికి ఇట్టం  లేదు, ఆడు సేయించుకోడుఏటి సేయమంటారొ మీరే సెప్పండమ్మగోరూఅంది లక్ష్మి.
పద నేను చెప్పి ఒప్పిస్తాను అని లక్ష్మిని వెంటబెట్టుకొని చెకప్ రూం నుండి కన్సల్టింగ్ రూం లోకి వచ్చి అక్కడ బుద్దిమంతుడిలా కూర్చొని అమాయకుడిలా కనబడుతున్న అతగాడితో అదే లక్ష్మి మొగుడితో అంది యశోధర.
చూడు బాబూ! ఈమె చాలా బలహీనంగా ఉంది. అందులోనూ గర్బిణీ. రక్తం బాగా లేకపోతే కాన్పు కష్టం అయిపోతుంది. పుష్టికరమైన ఆహారం అంటే బలమైన తిండి పెట్టాలి. పైగా ఈ టానిక్కులు వాడాలి.అని ప్రిస్క్రిప్షన్ చీటీ వ్రాసిస్తూ అందిఈ సారికేదో అయిపోయింది మళ్ళీసారి కాన్పు వస్తే మాత్రం మనిషి ప్రాణానికే ప్రమాదం అంచేత ఈ కాన్పు టైములోనే నీ భార్యకి మరి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసేస్తానుఏం? ఏమంటావు?”
ఆపరేసను ఒద్దమ్మగోరూ ఆపరేసనంటే నాకు భయం. దానికి సేత్తే ఆదేమైపోద్దోననినసిగేడు తవిటయ్య లక్ష్మి మొగుడు.
దొంగ సచ్చినోడు నా మీద ఎంత పేమ ఒలకబొత్తున్నాడో డాట్టరమ్మ దగ్గరమనసులోనే అనుకుంది లక్ష్మి.
ఇదేం పెద్ద ఆపరేషన్ కాదు భయపడడానికి. అతి చిన్న ఆపరేషన్. సులువుగా అయిపోతుంది. ఆపరేషను చేయించుకుంటే నీకు సంసారభారం తగ్గుతుంది. మీ ఆవిడ ఆరోగ్యం క్షీణించకుండా కాపాడినవాడవవుతావు. ఈ ఆపరేషను వల్ల ఎటువంటి బాధ, ఇబ్బంది,అనారోగ్యం, బలహీనత కలగదు. మీ ఆవిడికి ప్రభుత్వం ఓ చీరా, 145 రూ.లు ఇస్తుంది. చూడు ఆలోచించు.. నచ్చచెప్పింది. తవిటయ్య ముఖం విప్పారింది. 145/- రూ. కట్టపడకుండా ఒత్తున్నాయి. ఓ నెల్రోజులు పాటు మందుకు  మరి ఢోకానేదు  అనుకొన్నాడు. తవిటయ్యలో అంగీకార సూచనలు కనిపించి నవ్వుకుంది డా.యశోధర.
అలాగే నమ్మగోరూ! మా మంచి సెడ్డా మీకు తెలీదేటి ? మా ఆడదానికి మీ సేత్తోనే ఆపరేసను సేసెయ్యండి అన్నాడు.
చూసేవా లక్ష్మీ! నే చెప్పలేదూ మీ ఆయన్నీ ఒప్పిస్తాననిఅని డాక్టరమ్మ అనేసరికి ఆశ్చర్యపోవడం లక్ష్మి పనైంది.
………….x…………………. ……
లక్ష్మి ఆడబిడ్డని ప్రసవించింది. బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చెయడమూ అయిపోయింది. ఏదో చెప్దామని డా. యశోధర గదిలోకి వెళ్లబోతున్న తవిటయ్యకు ఆ   గదిలో  ఎవరో అతి దీనంగా అంటున్న మాటలువినపడ్డాయ్. నా ఇంటి దీపం ఆరిపోయేక నాకీ డబ్బెందుకమ్మా? “అది కాదండీ! మీ కక్కర్లేకపోయినా చనిపోయిన వారి కుటుంబానికి ఇది ప్రభుత్వం ఇచ్చే సొమ్ము.దాని పానం  ఇచ్చేసి నేను పదిఏలు  పట్టుకుపోనా అంటే దాని పానం ఖరీదు పదిఏలా? ” చ చ.. చ.. అలా అనలేదు . ఏదో నష్టపరిహారంగా పదిఏలు లు తీసుకొంటే అది పోయిన నట్టం పూడుతుందా? అదిలేని లోటు తీరుతుందా? ” “నిజమే కాని అయాచితంగా వస్తున్న దాన్ని మీరెందుకు కాదనాలి?”
తవిటయ్యకు అర్ధమైంది. తాగుబోతు బుర్రని తొలిచిందో పురుగు. పదివేలు నా జనమలో సూడగలనా? ఓహ్! ఆ డబ్బుతో ఓ మందు కొట్టెట్టి రోజూ మందు  కొట్టేత్తుండొచ్చు  అనుకుంటూ ఊహా సౌధాలలో తేలిపోసాగాడు తవిటయ్య.
………………………..x…………………….
ఒసేవ్ లచ్చివీ! సూసేవా నా కూతురెట్టా ఉందో? అంతా నా పోలికేనే! పుట్టిన బిడ్డను చూస్తూ అన్నాడు తవిటయ్య.ఫొ మావా! మొత్తానికి నాకు మంచి రోజులొచ్చి ఆపరేసను సేయించేసేవు అంతేసానఅంది అమాయకంగా బలైపోతున్నానని తెలియని మేకలా.
అవునే! నాకూ మంచిరోజులొత్తున్నాయ్. ఇదిగో ఈ పాలు తీసుకో, నీకు ఒంటో  బాగా రగతం (రక్తం) పట్టాలట. మంచి బలం రావాలి. ఊ! భార్యను మంచం మీద నుండి లేవదీస్తూ పాలగ్లాసు అందిస్తుండగా చూసింది డా. యశోధర. ఈ సారి ఆశ్చర్యపోవడం యశోధర వంతైంది.
.                                                                                            ………………………..x…………………….
డాక్టర్! బెడ్ నెం.7 పేషంట్ కి సీరియస్ గా ఉంది డాక్టర్!నర్స్ హడావిడిగా పరిగెత్తుకొంటూ వచ్చి చెప్పింది. ” ” ఆ! ఏమైంది!? ” కంగారుగా అడిగింది యశోధర….” ఏమో డాక్టర్. మిమ్మల్ని అర్జంటుగా ఓ సారి పిలుచుకు రమ్మంటుంది డాక్టర్.” “పద పదఅంటూ వార్డు వైపు పరుగులాంటి నడక తీసింది యశొధర.
ఊపిరాడక ఆయాసపడుతున్న లక్ష్మిని చూసి లక్ష్మీ ఏమైంది నీకు?’ అని అడుగుతూ సిస్టర్ ఆక్సిజన్ వెంటనే సిద్దం చేయిఅని పురమాయించింది. స్టెతస్కోపుతో పరీక్ష చేస్తూ మరో చేత్తో ఒంట్లో వేడిని చూడసాగింది. అమ్మగోరూ! నానిక బతకను నన్ను బతికించడానికి మీరు అవత్తపడొద్దు . నాను బతికినా సుకపడలేను. ఆడు సుకపెట్టేది నేదు. అతి కష్టం మీద మాట్లాడింది లక్ష్మి.
అదేంటి లక్ష్మీ? నీకేం భయం లేదు నేనున్నానుగా!డాక్టరుగా తన ధర్మాన్నినిర్వర్తిసూ ధైర్యం చెప్పింది యశోధర.
లేదమ్మగోరూ! నాను సెప్పేది ఇనండి.తరవాత సెప్పగలనో లేదో గొంతు పెగల్చుకుని మూలిగినట్లు అంది. మరణ వాగ్మూలం మిస్ అయిపోతుందేమోననే భయంతో చెప్పు లక్ష్మీ ఏమైంది?” అడిగింది యశొధర. ముక్కలు ముక్కలుగా రొప్పుకొంటూ చెప్పసాగింది లక్ష్మి. నా పెనిమిటి ఆ! నీ మొగుడు ఏం చేశాడు?” ” తాగిన మైకంలో ఓ గుట్టు బయట పెట్టేశాడు.ఏంటది ?” ఆతృతగా అడిగింది యశోధర.
నానుగాని ఇక్కడ సచ్చిపోతే ఆడికి పదిఏలు   ఇత్తారని తెలిసిందట.తవిటయ్యకు ఆ సంగతి ఎలా తెలిసిందో యశోధరకు అర్ధమైంది.
అందుకని నాకు పాలల్లో ఇసం కలిపి ఇచ్చేసేడు ఎంత ఘోరంవాపోయింది యశోధర. పాలు తాగేక గాని  నాకు ఈ  సంగతి  తెలీనేదు .”
ఉండు వాడి పని చెప్తాను. వాడు పదివేల కోసం పురిటిలోనే పెళ్లాం ప్రాణం తీస్తాడా? వాడు మనిషేనా? లేక హంతకుడా?వాడ్ని వెంటనే పోలీసులకు అప్పగిస్తాను అంటూ ఫోన్ తీయబోయింది.
ఒద్దమ్మగోరూ.. నేను లేక పిల్లలు దిక్కులేని వాళ్లయిపోతారు. ఇంక తండ్రి కూడా కూనీకోరని తెలిస్తే ఆల్లు భరించలేరు. లోకం సయించదు.
ఓ త్రాగుబోతు హంతకుడైన భర్తను కనికరిస్తున్న నీలాంటి భార్యలున్నంతకాలం భర్తల అరాచకాలూ, జులుం సాగుతూనే ఉంటాయి.ఆవేశంగా అంది యశోధర.
ఆడు ఇప్పుడు కూడా ఆపరేసను సేసుకున్నందుకు మీరు నాకు ఇచ్చిన డబ్బులెట్టుకెళ్ళి ఏ కల్లుపాకలోనో తాగుతుంటాడు. నాను పోయేసరికి ఆడు మారితే అంతేసాన”.
మద్యపానం  వల్ల కలిగే అనర్దాలు తెలిసి కూడా దానికి దూరం కాలేని దురదృష్టవంతులపై జాలిపడడం తప్ప ఏమీ చేయలేం అని యశోధర ఓ నిట్టూర్పు విడిచింది. అమ్మగోరూ! నా సివరికోరిక.నాలుక పొడిబారిపోతుండడం గమనించి ఏంటి లక్ష్మీ ?” చెప్పు కంగారుగా అడిగింది యశోధర.
నాను పోయేక ఇచ్చే పదిఏలు  మాత్రం ఆడికియ్యకండి. నా పిల్లల పేరున ఏసి  ఆల్లని ఏ అనాదాస్రమం లోనో సేర్పించండి. అంతేకానీ ఆడి నీడ పడనీయకండి. మీకు సేతులెత్తి మొక్కుతాను. ఈ పున్నెం  కాత్త  కట్టుకోండి అంటూ డాక్టరమ్మ చేతులు వదిలి ఆఖరి శ్వాస విడిచింది లక్ష్మి. ఆఖరి ఘడియల్లో కూడా ఆప్తులెవరూ లేని లక్ష్మికి ఆప్తురాలై ప్రక్కన నిలబడింది డా.యశోధర.అనాధలైన ఆరుగురు ఆడపిల్లలను ఏడుస్తున్న వార్డులోని ఏడో బిడ్డను చూసి చావు ఓ మామూలు విషయంగా తీసుకొని చలించని డాక్టరమ్మకు కూడా డాక్టరమ్మకు కళ్లలో నీళ్ళు నిండేయి. బలిపశువులా అయిన లక్ష్మిని తలచుకొని భారంతో అక్కడ నుండి కదిలింది డా.యశోధర తన విధ్యుక్త ధర్మాన్ని నెరవేర్చడానికి.
                                                                                                                                                                        రచనమురళీధర శర్మ పతి

Comments