శ్రీశైల క్షేత్రం..
శ్రీశైల క్షేత్రం..
శ్రీశైలం
ఆంద్రదేశ్ కర్నూలు జిల్లాలో వెలసిన స్వయం భూలింగ మూర్తి ఉన్న క్షేత్రము. విశేషించి
అష్టాదశశక్తి పీఠములలో శ్రీశైలంలో ఉన్న భ్రమరాంబికా అమ్మవారు ఒక శక్తిపీఠం.
శ్రీశైలం అంత గొప్ప క్షేత్రం. ఆ పరమేశ్వరుడు వెలసిన కొండపేరు శ్రీగిరి. మనం
ఎవరినయినా గౌరవవాచకంతో పిలవాలని అనుకున్నప్పుడు పక్కన శ్రీకారం చుడతాము. శైలమునకు
ముందు శ్రీకారం వ్రాయబడి శ్రీశైలం అయింది. దానిపేరు శ్రీగిరి. శ్రీశైలంలో స్వామి
లింగమూర్తియై అరూపరూపిగా ఉన్నాడు. ఉన్నది ఒక్క పరమాత్మే రెండుగా భాసిస్తున్నాడు.
శ్రీగిరి అన్న పేరు రావడానికి సంబంధించి స్థల పురాణం ఒకమాట చెప్పింది. ఒక
భక్తురాలు తాను ఒక కొండగా మారాలని కోరుకున్నది కాబట్టి ఆమె శైలముగా మారినది అని
చెబుతారు. కానీ దాని తాత్త్వికమయిన రహస్యం వేరు. శ్రీ’లో ‘శ’కార, ‘ర’కార, ‘ఈ’కారములు ఉన్నాయి. ఈ మూడక్షరములు బ్రహ్మశక్తి, రుద్రశక్తి, విష్ణుశక్తి – ఈ మూడు శక్తులను తెలియజేస్తాయి. ఈ మూడు శక్తులు ఉన్న కొండ
శ్రీశైలం. ఈ మూడు శక్తులు మమైకమయిన శక్తి రూపిణి భ్రమరాంబిక. అందుకని శ్రీశైలం ఒక
శక్తి పీఠం. ఆ కొండమీద అడుగుపెట్టిన వాడు సరస్వతీ కటాక్షమును కానీ, లక్ష్మీ కటాక్షమును గానీ, జ్ఞానమును గానీ నోరువిప్పి అడగక్కరలేదు. అతనికి
కావలసినది ఆ కొండలోంచి ప్రసరిస్తుంది. అంత శక్తిమంతమయిన కొండ. శ్రీశైల పర్వతం
ఎన్నో ఓషధులకు ఆలవాలము. శ్రీశైలము ఎన్నో ఉపాసనలకు ఆలవాలము. అటువంటి శ్రీశైలంలో
పర్వతం మీద పరమశివుడు స్వయంభువుగా వెలిశాడు. ఆయన అక్కడ వెలవడానికి గల కారణం
గురించి పెద్దలు ఒక విషయమును చెప్తారు. గణాధిపత్యం ఎవరికి ఇవ్వాలి అని నిర్ణయం చేయవలసి
వచ్చినప్పుడు శంకరుడు తన ఇద్దరు కుమారులను పిలిచి, ఎవరు భూమండలమునంతటిని తొందరగా ప్రదక్షిణం చేసి వస్తారో
వారికి గణాధిపత్యం ఇస్తాను అని చెప్పగానే సుహ్రహ్మణ్యేశ్వర స్వామి గబగబా బయలుదేరి
భూమండలంలో ఉన్న దేవాలయములన్నింటినీ దర్శనం చేసుకుంటూ వస్తున్నారు. గణపతి మాత్రం
అలా అన్ని దేవాలయములకు వెళ్ళలేదు. సూక్ష్మలో మోక్షం అన్నట్లుగా ఆయన ‘నాన్నగారూ, తల్లిదండ్రులకు చేసిన ప్రదక్షిణం భూమండలమునకు చేసిన
ప్రదక్షిణతో సమానం. కాబట్టి నేను మీకే ప్రదక్షిణం చేసి మీకే నమస్కరిస్తున్నాను’ అని తన తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేశాడు. ఈవిధంగా
గణపతి తన బుద్ధి కుశలతను ప్రదర్శించాడు. అపుడు శంకరుడు గణపతికి గణాధిపత్య పదవిని
ఇచ్చారు.
సుబ్రహ్మణ్యుడికి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
పార్వతీ పరమేశ్వరులిద్దరూ సుబ్రహ్మణ్యుడిని ఇంటికి రమ్మనమని కోరడానికి వెళ్ళారు.
వీరిని చూసి సుబ్రహ్మణ్యుడు 24 క్రోసుల ముందుకు వెళ్ళిపోయాడు.
అపుడు శంకరుడు మల్లెతీగల చేత చుట్టుకోబడిన ఒక అర్జున వృక్షం క్రింద కూర్చున్నాడు.
అపుడు పార్వతీదేవి కూడా వెళ్ళింది. పిల్లవాడు ఎలా ఉన్నాడో అని శంకరుడు
సుబ్రహ్మణ్యుడు ఉన్న చోటుకు వెళ్లి కొడుకును బుజ్జగించాడు. ఆయన అలక తీరిపోయింది.
ఆయన మహా జ్ఞానిగా నిలబడ్డాడు. శ్రీశైలమునకు పరమేశ్వరుడు ప్రతి అమావాస్య నాడు
వెళ్లి దర్శనం చేసి వస్తూ ఉంటాడు. ప్రతి పౌర్ణమి నాడు అమ్మవారు వెళ్లి దర్శనం చేసి
వస్తూ ఉంటుంది. పిల్లవానికి దగ్గరలో ఉన్నామని అనిపించుకోవడానికి అక్కడే ఉంది
సుబ్రహ్మణ్యుడిని చూసుకుంటూ ఈ మల్లెచెట్టు క్రిందకి వచ్చాము
కదా అని అక్కడ వెలశారు. మనం అలకచేతనో, అజ్ఞానం చేతనో మన
శరీరములను చూసుకుని భగవంతునికి దూరం అవుతున్నాము. ఇలాంటి వాళ్ళు ఎవరయినా ఉంటే
వాళ్ళ దగ్గరకు తానే వెళ్ళిపోతాను అని చెప్పి వచ్చి పరమశివుడు శ్రీశైలంలో
కూర్చున్నాడు. శ్రీశైల మల్లికార్జునుడిది ధూళి దర్శనం. మీరు మీ ప్రదేశం నుంచి
శ్రీశైలం వెళ్ళే లోపల ఎంతో అశౌచమునకు లోనవుతుంది మీ శరీరం. ఆ బట్టలతో కొండమీదకి
వెళతారు. మీరు శుభ్రపడి దర్శనానికి వెడితే ఆయన కొద్దిగా చిన్నబుచ్చుకుంటాడట. మీరు
ఆ క్షేత్రమునకు వెళ్ళగానే ఆశౌచంతో కూడిన శరీరంతో గుడి దగ్గరకు వెళ్లి ధూళి
దర్శనమునకు వచ్చాము అని చెప్పి లోపలి వెళ్లి ఈ మట్టి కాళ్ళతో మోకాళ్ళ మీద కూర్చుని
మట్టి చేతులతో శివలింగమును ముట్టుకుని, శివలింగం మీద తల
తాటిస్తే పరమేశ్వరుడు పొంగి పోయి సర్వకామ్య సిద్ధిని ఇస్తాడుట. దీనిని ధూళి దర్శనం
అంటారు శ్రీశైలంలో. కాబట్టి శ్రీశైలంలో ధూళి దర్శనం చెయ్యాలి.
అసురసంధ్య వేళలో నందివాహనం భూమండలం మీదనుండి వెడుతుంది.
అటువంటి సమయంలో పరమాత్మ శ్రీశైలపర్వతం మీద ఒకసారి దిగుతాడు. అంత పరమ పవిత్రమయిన
సమయంలో శ్రీశైలంలో దేవాలయంలో కూర్చుని శివాష్టోత్తర శతనామములు చదువుకున్నట్లయితే
అక్కడ దిగిన పరమాత్మ అది చూసి ఆయనను అన్ని పేర్లు పెట్టి పిలిచినందుకు ఎంతగానో
సంతోషిస్తాడు. జన్మ చరితార్థం అయిపోతుంది. చెంచులు చెవిటి మల్లన్నా అని అరుస్తూ
ఉండేవారు. చెవిటి మల్లన్న అంటే ఆయన పొంగిపోతాడట. శ్రీశైలంలో పరమేశ్వరుడు తన భక్తుల
కోర్కెలను తీర్చడానికి ఒక తండ్రిగా వచ్చి కూర్చున్నాడు. శ్రీశైలం స్వామీ వారిని
దర్శించడానికి వచ్చిన వారి గోత్రనామమునలు ప్రత్యేకంగా ఒక చిట్టాలో వ్రాయమని
అమ్మవారు గణపతికి చెప్పింది. అందుకే శ్రీశైలం వెడితే తప్పకుండా సాక్షి గణపతి దగ్గర
ఆగాలి. లోపలి వెళ్లి మన గోత్రం, పేరు, చెప్పుకోవాలి. గణపతి మన గోత్ర నామమును చిట్టాలో
రాసేసుకుంటారు.
శ్రీశైలంలో శిఖరేశ్వరం ఉంది. అక్కడికి నువ్వులు పట్టుకెళ్ళి
నంది విగ్రహం దగ్గర పోస్తారు. పూర్వకాలంలో శివాలయంలో చరనంది ఉండేది. పూర్వం
రోజులలో ఇప్పుడు ఉన్నంత వైద్య సదుపాయం ఉండేది కాదు. శివాలయం, విష్ణ్వాలయం తప్పకుండా ఉండి తీరేవి. ఎవరయినా గర్భిణీకి
అనుకోకుండా నొప్పులు వస్తే పట్నానికి తీసుకు వెళ్ళడానికి అవకాశం లేకపోతే అంతరాలయం
మూసేసి ఉన్నా కూడా పరుగెత్తుకుంటూ అర్చకుడి దగ్గరకు వెడితే ఆలయ ప్రధాన ద్వారం
తీసేవారు. ఈ బాధ పడుతున్న గర్భిణి ఇల్లు ఎటువైపు ఉన్నదో అటువైపు చరనందిని
తిప్పేవారు. ఈ చరనంది అటు తిరగగానే అటువైపు బాధపడుతూ ప్రసవం జరగకుండా ప్రాణాలు
పోతాయేమో నని అనుకున్న వాళ్లకి కూడా ఎందరికో సుఖప్రసవములు జరిగేవి.
అందుకే అనేక శివాలయములలో చరనంది ఉండేది. శిఖరేశ్వరంలో కూడా
మనం ఈశ్వరుణ్ణి పొందలేక పడుతున్న బాధ నుంచి విముక్తం కావడానికి నువ్వులు వేసి తిప్పి
శిఖరం చూడాలి. కానీ యథార్థమునాకు శిఖరము నంది శృంగములలోంచి కనపడదు. మీరు భావన
చేస్తూ కళ్ళు తెరచి అక్కడ చూడాలి. ఈ కన్నులు తెరచి నంది శృంగములలోంచి చూస్తుంటే
జేగురు రంగులో ఉన్న శ్రీశైల మల్లికార్జునుని ఆలయ గోపురం మీద వున్నా త్రిశూలంతో
కూడి మెట్లు మెట్లుగా ఉన్న శిఖరం మీకు కనపడాలి. అలా కనపడిన వాడికి ఒక పునర్జన్మ
ఉండదు. అందుకే శిఖరేశ్వర దగ్గర పరమాత్మ ఒక పరీక్ష పెట్టాడు. ఒకసారి అమ్మవారు ‘ఏమండీ శిఖరేశ్వరం
దగ్గరకు వచ్చి నందిని తిప్పి శిఖరం చూస్తే ఇక పునర్జన్మ లేకుండా మోక్షమును
ఇచ్చేస్తారా? అని. అపుడు శంకరుడు “శ్రీశైలం వచ్చిన
వారందరికీ మోక్షం ఇవ్వను. ఎవరికి ఇస్తానో నీకు చూపిస్తాను అని ఆయన ఒక వృద్ధ
బ్రాహ్మణ రూపమును స్వీకరించారు. ఒక వృద్ధ బ్రాహ్మణిగా పార్వతీదేవి వచ్చింది.
ఇద్దరూ ఆ శిఖరేశ్వరం దగ్గరికి వచ్చారు. మెట్లు ఎక్కుతున్నారు. నంది శృంగముల లోంచి
చూస్తున్నారు. క్రిందికి దిగిపోతున్నారు. ఈశ్వరుడు అక్కడ చిన్న ఊబిని సృష్టించాడు.
అందులో వృద్ధ బ్రాహ్మణుడు దిగిపోతున్నాడు. ఆ ఒడ్డున ఉన్న వృద్ధ బ్రాహ్మణి ‘మా అయన
దిగబడిపోతున్నాడు. అందుకని ఎవరయినా ఒక్కసారి చేయినిచ్చి పైకి లాగండి’ అన్నది. అందరూ గబగబా వచ్చి చెయ్యి ఇవ్వబోయారు. అపుడు ఆమె
మీలో పాపం లేనివారు పైకి లాగండి అంది. అపుడు ప్రతివాడూ తాను ఏదో పాపం చేసి ఉండక
పోతానా అనుకుని వెనక్కి వెళ్ళిపోయారు.
ఆ సమయంలో అటుగా ఒక వేశ్య కిందికి దిగుతోంది. ఈవిడ వేశ్య అని
అందరూ అంటున్నారు. ఆవిడ దిగుతూ వచ్చి నేను లాగుతాను అన్నది. అపుడు పార్వతీ దేవి
ఏమమ్మా, అందరూ మాకు పాపం ఉంది అని వెళ్ళిపోతున్నారు. వాళ్ళ పాపము
కంటే నీ పాపం గట్టిది కదా. అటువంటి అప్పుడు నువ్వు నా భర్తను ఎలా లాగుతావు అని
అడిగింది. అపుడు ఆవిడ శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే – అమ్మా నేను ఇప్పడు శిఖర దర్శనం చేశాను. మోక్షం రావాలంటే పాపం
లేదు, పుణ్యం లేదు. రెండూ సున్నా అయిపోతేనే కదా మోక్షం. ఇపుడు నా
ఖాతాలో పాపం లేదు. పుణ్యం లేదు అందుకని లాగుతున్నాను. నేను అర్హురాలను’ అంది. ఈవిడకు విశ్వాసం నిజంగా ఉన్నది ఈవిడకు మోక్షం
ఇస్తున్నాను’ అని శివుడు పార్వతికి చెప్పాడు. నంది శృంగములలోంచి చూడడం కాదు.
అక్కడ ఉన్నది తన తల్లిదండ్రులని నమ్మిన వాడు ఎవరో వానికి మాత్రమె మోక్షం
ఇవ్వబడుతుంది. కాబట్టి శ్రీశైల క్షేత్రంలో అడుగు పెట్టిన వాడికి తాను తన
తల్లిదండ్రుల దగ్గర ఉన్నాననే భావన ఉండాలి. ఈ భావన పరిపుష్టమై మీరు శ్రీశైలం వెడితే
మీకు అక్కడ ఎనలేని సౌభాగ్యం కలుగుతుంది.
Comments
Post a Comment